Saturday, 17 November 2018

నా ... నీ

నీ మాటలు వరములై 
హృదయ తలుపులు తడుతుంటే
నీ వాలు చూపులు బాణాలై
నా గుండెను మెలిపెడుతుంటే
నీ ఆశయాలు మలుపులై 
నా గమ్యాన్ని నిర్దేసిస్తుంటే 
నీ నవ్వులు పువ్వులై 
నా మనసులో పరిమళిస్తుంటే
నిన్ను మరవలేని స్థితి
ఏమి దిక్కుతోచని పరిస్థితి
నీకై వేచిచూస్తూ అలసిపొయాను..

Monday, 12 November 2018

సమాజం

కళ్ళు ఉన్న సమాజం
చదివేది మనసును కాదు

మోసం చేసే సమాజం
మానవత్వం చూడదు 

ముప్పుతెచ్చే సమాజం
చెప్పిన మాట వినదు

వెర్రితలల సమాజం
వెక్కిరించడమే చెస్తుంది

వెర్రిబాగుల సమాజం
మంచిని విస్తుపోయి చూస్తుంది 

Friday, 6 July 2018

ఎదలో

రాగాలు తీస్తూనే మైమరచిపోయా
చిరుగాలి తరగలకే చిందులేశాను
ఏటికే నీవింక ఎనలేని హొయలని
వయసు ఊహల్లో నిన్ను నింపాను
న నువ్వు ఎగిరెగి పడుతుంటే
గిలిగింతలతో ఒళ్లు తుళ్లింతపడెను
నీటిలోన నన్ను నేను చూసుకుని
నిను చూచినట్లు మనసు పరుగులెత్తేను 
గోదారి వలె నువ్వు గలగలా నవ్వకే
నీవు లేవన్న ధ్యాసతో నాకు ప్రాణం తీయకే

Thursday, 28 June 2018

నీ నిరాశ

నిరాశ నిస్ప్రహ నిర్లక్ష్యం 
వైఖరి నీలో రేపును అలజడి 
నిరంతరం నిశ్చల నిర్మల ఆలోచనలతో
నిశ్శబ్ద భావాల్ని ప్రకటిస్తూ
అందరితో వాటిని పంచుకుంటూ
ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయాలను 
తీసుకుని ముందుకు సాగిపోతూ 
నీ జీవిత గమ్యాన్ని నిర్దేశించుకో నీవు

Monday, 21 May 2018

వెలుగు

గొంతు దాటి రానీయకు 
గుండెలోని భావాలను
గొంతులోనే త్రుంచేయి 
మనసులోని మాటలను
కంటిలోనే ఇంకిపోనీయి
కన్నీటి శోకాలను 
నవ్వు రాకపోయినా 
విరిసి నవ్వనీ పెదవులను 
వెలుగు లేనిదే 
నీడ కూడా రాదు నీతోను 
కాలం కలసిరానిదే 
అనుకున్నది జరుగదు...

Friday, 27 April 2018

అంతర్మధనం

నీ లోతుల్లో ఏ మూలో
దాక్కున్న అంతర్ముఖం
పగలంతా నిద్రలో జోగుతూ
రాత్రుళ్ళు కత్తులు రువ్వుతుంది
ఎగిసిపడే ఆలోచనలలో
తడిసి ముద్దయ్యే నిన్ను 
నీవే కౌగిలించుకుని
భావ తీవ్రతలో
ఆర్థ్రమయ్యే మనసుకు
జోలపాట పాడే ప్రయత్నంలో
అంతర్ముఖంతో అంతర్మధనం చేస్తావు 

Wednesday, 11 April 2018

నువ్వు

నా బాధలో భాష్యంలో తోడు నువ్వు 
అలవోకగా కదలాడే అలజడి నీవు!!
నా ఒంటరితనపు చేయూత నువ్వు 
ఆశల వెల్లువలో ఊరట నీవు!!
నా ప్రతి కదలికకీ భాష నువ్వు 
ఆగ్రహం వచ్చిందంటే ఆనకట్టవు నీవు!!
నా తోడు నీడా అన్నీ నువ్వు
సమస్యలో పరిష్కారం కూడా నీవు!!
నా నిశిరాతిరి ప్యనం నువ్వు
మండుటెండలో మంచుకొండవు నీవు!!

Wednesday, 4 April 2018

ఊహ

ఏదో ఒకసారి గుర్తుకురావడం ఏమిటి?
మస్తిష్కంలోని ప్రతికణంలో నిక్షిప్తమైపోతే
ఏదో ఒక స్థితి పరిస్థితి
ఏదో ఒక సంఘటన ఒక అనుభూతి
అప్పుడప్పుడూ మేఘాలు కమ్మే 
మనసు ఆకాశం అయిపోయి
హృదయతంత్రులు వేదనతో నిండె
గుండె భారం అయిపోయి
అయినా ఏదో రాగం ఆలపిస్తున్నా
నువ్వు నేను ఒకటే అనుకున్న ఊహల్లో..

Friday, 2 March 2018

ఓర్పు

ఊహల్లో ఉండటం ఎంత హాయిగా ఉంటుంది
జ్ఞాపకాలు అంతే మధురంగా ఉంటాయి
జరుగుతున్న వాస్తవం చేదుగా ఉంటుంది
ప్రతిదీ కాలమే నిర్ణయిస్తుంది
జరగాల్సింది జరిగిపోతుంది..
అయినా ఓర్పు తప్పదు జీవితానికి!!....

Friday, 19 January 2018

అంతరంగదర్పణం

అనుభవాలు భావపాతాలై 
గుండె శిలలను చేరితే 
అలజడి చెందిన అంతరాత్మ 
బ్రతుకు ఒరవడిని తాళలేక 
పల్లాలని వెదుక్కుంటూ
అంతర్మధనానికి లోనై  
మది లోయల్లోకి జారుకుంటాయి  
చచ్చిన ఆశలు ఆడుకుంటాయి
జ్ఞాపకాలు ఒడ్డున పడేస్తాయి
అనుభవసారాలై జీవితాన్ని సరిచేస్తాయి..

Monday, 1 January 2018

ముక్తి

ఈ అంతరంగపు ఎడారిలో 
భావకవితలే ఒయాసిస్సులు 
కళల కలల్లో జీవిస్తూ 
ప్రతీ పాత్రలో లీనమైనప్పుడు
అంతర్మధన విముక్తి కష్టం
కవితా రూపకల్పనకై చేసే కృషి
కళాసాధనకి సంపూర్ణత ఇస్తుంది